Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జమ్ము కశ్మీర్‌లో భారీ ఆహార కుంభకోణం.. 11 లక్షల బోగస్ రేషన్ కార్డుల గుర్తింపు

జమ్ముకశ్మీర్‌లో భారీ ఆహార కుంభకోణం గుట్టురట్టయింది. రాష్ట్రంలో 11 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం తద్వారా నెలకు 5,500 టన్నుల బియ్యం స్వాహా అవుతున్నట్టు నిర్ధారించింది. జాతీయ ఆహార భద్రత పథకం కోసం రేషన్ కార్డులను తనిఖీ చేస్తుండగా ఈ అతిపెద్ద కుంభకోణం బయటపడినట్టు ప్రభుత్వం పేర్కొంది. ‘‘11 లక్షల బోగస్ కార్డులను గుర్తించి తొలగించాం. ఇక నుంచి ప్రతీ నెల 5,500 క్వింటాళ్ల బియ్యం ఆదా అవుతాయి’’ అని ఆహార మంత్రి చౌదరీ జుల్ఫికర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. చౌక దుకాణాల ద్వారా తమకు అందేది బహు తక్కువని వారు చెబుతున్నారు. తమ కుటుంబంలో పదిమంది సభ్యులున్నారని, కానీ 30 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయని 60 ఏళ్ల జూనా బేగం పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పట్టుమని పదిరోజులు కూడా రావడం లేదన్నారు. కాగా ఇప్పటి వరకు 11 లక్షల బోగస్ కార్డులను గుర్తించి తొలగించామని, త్వరలో కొత్త కార్డులు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 26 లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు అందజేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 8 లక్షల కార్డులు అందించినట్టు వివరించారు. కాగా బోగస్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

More Telugu News